KCR: ఫాంహౌస్ లో కబ్జా ఆరోపణలు.. కేసీఆర్ మౌనంతో మరింత డ్యామేజ్..?
KCR: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు గజ్వేల్ వైపు మళ్లింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కంచుకోట లాంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చుట్టూ భూ ఆక్రమణ వివాదం ముసురుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు సమీప చెరువులు, కాలువల స్థలాలను ఫాంహౌస్ కోసం కబ్జా చేశారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు ముమ్మరం చేస్తుండగా, వివాదం కేంద్రంలో ఉన్న కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.హైదరాబాద్ పరిసరాల్లో చెరువుల పరిరక్షణ పేరుతో 'హైడ్రా' పేల్చిన బాంబులు ఇప్పటికే బడా నేతల్లో గుబులు రేపాయి. ఇప్పుడు ఆ రగడ ఏకంగా కేసీఆర్ వ్యక్తిగత అడ్డా అయిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ హద్దుల వరకు చేరింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సర్వే నిర్వహించి, అతి తర్వలో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రవల్లి ఫాంహౌస్ కోసం భూములు ఆక్రమణకు గురైనట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే అధికార పక్షం స్పష్టం చేసింది.
