తెలంగాణ

Kamareddy: కామారెడ్డిలో వర్షం బీభత్సం.. కౌన్సిలర్ వినూత్న నిరసన!..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి–కరీంనగర్ జాతీయ రహదారిలోని స్టేషన్‌ రోడ్డుపై పోలీస్‌ స్టేషన్‌ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్డంతా కుంటను తలపించడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై 46, 47వ వార్డు కౌన్సిలర్‌ గెరిగంటి లక్ష్మీనారాయణ నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. సమీపంలోనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో 108 వాహనాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, లేదంటే దీక్ష చేపడతామని అధికారులను హెచ్చరించారు.