కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. తులం బంగారం దేవుడెరుగు..స్కీం నీరుగార్చొద్దు : హరీశ్ రావు
కళ్యాణలక్ష్మి పథకానికి నేటితో 12 ఏళ్లు పూర్తి అయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘కళ్యాణ లక్ష్మీ పథకం.. సామాజిక సంస్కరణ పథం. బాల్య వివాహాలను అడ్డుకుని పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తి.. ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచనే కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.
2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్ను తీవ్రంగా కలచివేసింది. బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు, బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్ను చూసిన కేసీఆర్ చలించిపోయారు.ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి ఆ బిడ్డ పెళ్లి జరిపించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు.ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్.
