Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. బహుజనుల బాణాన్ని : కవిత
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి సొంత అడ్డా కొడంగల్ గడ్డపై నుంచి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై ముప్పేట దాడి చేస్తూనే.. స్థానిక పరిస్థితులపై నేరుగా సీఎంపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కార్యకర్తల భారీ ర్యాలీ నడుమ నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.తన రాజకీయ అస్తిత్వంపై వస్తున్న విమర్శలను కవిత సూటిగా తిప్పికొట్టారు. "కాంగ్రెస్ విడిచిన బాణమని బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తుంటే.. కేసీఆర్ వదిలిన బాణమంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మరికొందరు బుర్రలేని వ్యక్తులు నేను బీజేపీ బాణమంటూ ప్రచారం చేస్తున్నారు. కొడంగల్ సాక్షిగా తేల్చి చెబుతున్నా.. నేనెవరి బాణాన్నీ కాదు. అధికారానికి, నాణ్యమైన విద్యకు నోచుకోని తెలంగాణ బహుజనుల బాణాన్ని నేను. తెలంగాణ యువత గొంతుకను, అంబేడ్కర్ వాదాన్ని, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆత్మగౌరవ నినాదాన్ని నేను" అంటూ గర్జించారు.
