నీటి వాటాలు తక్కువ చేసి రైతులను ముంచారు.. బీఆర్ ఎస్పై మంత్రుల ఫైర్
Jurala Project: రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి ఎద్దడిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రైతుల సమస్యలను పరిష్కరించడం కంటే, వాటిని రాజకీయం చేయడానికే బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోందంటూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు వద్ద గులాబీ నేతలు చేస్తున్న హడావుడిని ఎండగడుతూ మంత్రి జూపల్లి సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.తెలంగాణలో అన్నదాతల ప్రయోజనాల కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. "కర్ణాటక ప్రభుత్వ కాళ్లు పట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారు. అవును.. రాష్ట్ర రైతాంగం కోసం, సాగునీటి అవసరాల కోసం పక్క రాష్ట్రం కాళ్లు మొక్కినా ఎలాంటి తప్పులేదు" అని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఇప్పటికే నీటి విడుదల విషయమై కర్ణాటక సీఎంతో మాట్లాడుతున్నామని, ఆయనకు అధికారికంగా లేఖ కూడా రాశామని వెల్లడించారు.
