తెలంగాణ

జూరాలకు జలకళ.. కర్ణాటక హామీతో సాగుకోసం నీటి విడుదల

గత వారం రోజులుగా జూరాల ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి.ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలు, రాస్తారోకోలు, డ్యాం ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు.దీంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాగు కోసం నీటి విడుదల చేసేందుకు అంగీకరించింది.ఈ మేరకు కర్ణాటక సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపి 7 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం పొందింది.నెల రోజులపాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో జూరాల నుంచి సాగునీటి విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.దీంతో ఇవాళ ఉదయం జూరాల కుడి,ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు.