డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయవిచారణ జరపాలి : సీపీఎం
ఏపీలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో అసలైన అర్హులకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. ఈ మేరకు వైసీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.దీనికి బదులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సైతం వైసీపీ ఆందోళనలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. విజయవాడలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలని తాజాగా సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘డీఎస్సీ అక్రమాలపై నిరసనకు దిగిన వైసీపీ కార్యకర్తలు/ నిరుద్యోగులపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం.తమ సమస్యలపై నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పార్టీలు, సంఘాలు, సంస్థల ప్రాథమిక హక్కు.హక్కును నిరాకరించడం అప్రజాస్వామికం’ అని పేర్కొంది.
