తెలంగాణ

తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాసేపు అక్కడ తోపులాట నెలకొనడంతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపోయారు.ఆ గుంపులో నుంచి ఆయన్ను తోటి ఎమ్మెల్యేలు బయటకు తీసుకుని రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగదీశ్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.