తెలంగాణ

చాలా కష్టంగా ఉంది.. ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా : ఐబొమ్మ రవి

కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీగా మార్చి ‘ఐ బొమ్మ’(iBomma) వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు జనాలను బెట్టింగ్ యాపుల వైపు అట్రాక్ట్ అయ్యేలా ప్రోత్సహించిన కేసులో ఐబొమ్మ రవి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రం విశాఖపట్టణంకు చెందిన రవి.. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఐ బొమ్మ సామ్రాజ్యాన్ని నడిపించాడు.సినిమాలను పైరసీ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల కంటే బెట్టింగ్ యాప్స్‌ను ‘ఐ బొమ్మ’ సైట్లో ప్రమోట్ చేసినందుకు గాను రూ.వందల కోట్ల ఆస్తులు పొగేసుకున్నాడు. తాజాగా రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ అవ్వడంతో తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాని పిటిషన్ వేసినట్టు సమాచారం. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని,కుటుంబ పోషణ, నిత్యావసరాలు, వైద్య ఖర్చులు కూడా భారంగా మారాయని, ఇతరుల మీద ఆధార పడాల్సివస్తోందని తన సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.