తెలంగాణ
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్సే తెచ్చింది : హరీశ్ రావు
రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. వర్భాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం!. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు!’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం వద్ద నీరు వృథాగా పోతున్నా పంపుహౌసుల ద్వారా ఎత్తిపోసి అన్నదాతలకు నీళ్లు ఇవ్వడం లేదని, రేవంత్ సర్కార్ కావాలనే రైతుల మీద పగ తీర్చుకుంటుందని ఆరోపించారు.
