తెలంగాణ

నిమజ్జనం స్పెషల్.. 24 గంటల పాటు ఆర్టీసీ బస్సు సేవలు

హైదరాబాద్ మహానగరంలో నేడు గణనాథుల నిమజ్జనాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే వందలాది గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుండగా..మరికొన్ని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బేబి పాండ్స్ వద్దకు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తికానుంది. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిగేలా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌ సమీప ప్రాంతాలకు, అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు 24 గంటల పాటు నిరంతరాయంగా సుమారు 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. శోభాయాత్ర రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులు, పర్యవేక్షణ కోసం 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను రంగంలోకి దించింది.