కేసీఆర్ తీరు మారకుంటే మరో పదేళ్లు అక్కడే : మంత్రి శ్రీధర్ బాబు
మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత రెండున్నరేండ్లలో ఆయన కేవలం రెండు మూడు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని ..ప్రజాసమస్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఆయన సభకు రాకుండా తన వాళ్లను సభకు పంపించి గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షనేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని లేదా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహాధర్నా'లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని నిరసిస్తూ ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు,మంత్రులు, కార్యకర్తలు హాజరయ్యారు.
