‘దానం’ ఎన్నిక చెల్లకపోతే నేనే ఎమ్మెల్యే : విజయారెడ్డి
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అసెంబ్లీ సెక్రెటరీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడిందని గెజిట్ విడుదల చేశారు.సరిగ్గా ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ఈసీ చేపట్టిన తరుణంలో 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి దానం నాగేందర్ (బీఆర్ఎస్) చేతిలో ఓడిపోయి రెండో స్థానానికి పరిమితమైన విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానం నాగేందర్ తన ఎన్నికల అఫిడవిట్ (ఫామ్ -26)లో తన భార్య, డిపెండెంట్ల ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించకుండా కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ 2024 జనవరిలో విజయారెడ్డి హైకోర్టులో మొదటిసారి ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఆమె అందులో కోరారు. ఒకవేళ కోర్టు విచారణలో దానం నాగేందర్ ఎన్నిక తప్పు అని తేలితే, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంటుందని విజయారెడ్డి భావిస్తున్నారు.
