తెలంగాణ

నీలాగా విషనాగుల మాటలు వినను.. కేటీఆర్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కవిత ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?’ అని ప్రశ్నించారు. ‘మీరు మీ పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?.. మీ ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’ అని నిలదీశారు.