నేను మరో జీవన్ రెడ్డిని అవుతా.. కానీ! : చిన్నారెడ్డి
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు నానాటికీ పెరుగుతున్నాయి. సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు సర్కారు, పార్టీమీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముందు నుంచి పార్టీలో పనిచేసే వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని, పార్టీలో వారి పెత్తనమే నడుస్తోందని పలువురు సీనియర్లు వాపోతున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వచ్చి చేరారు. నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపైనా చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
