తెలంగాణ

నాకు ఎమ్మెల్సీ వద్దు.. ఎమ్మెల్యే టికెట్ కావాలి : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అన్ని పార్టీల కంటే ముందే అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఓ అభ్యర్థి హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ వద్దు అని.. ఎమ్మెల్యే సీటు కావాలని పట్టుబట్టి కూర్చున్నట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక హైమాండ్ తలపట్టుకున్నట్టు సమాచారం. ‘నల్గొండ–ఖమ్మం–వరంగల్’ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనంటూ చేతులు ఎత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రాడ్యుయేట్ టికెట్ కావాలంటూ ఎవరిని అడగలేదని, పోటీ చేయమంటూ పార్టీ పెద్దలు కూడా తనను సంప్రదించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తనను ఒక్కమాట కూడా అడుగకుండా అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని ఆయన పార్టీలోని కీలక నేతలను కలిసి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.