తెలంగాణ

హైడ్రా రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందే : హైకోర్టు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను లెక్క చేయకుండా కూల్చివేతలకు పాల్పడినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని కోరింది. ఈ విషయంలో రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోసారి రంగనాథ్ మీద కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించిన పిటిషన్ దాఖలు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకివెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 (పార్ట్), 175 (పార్ట్) తదితర సర్వే నంబర్లలోని 36.37 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందిందని, అందులో కూల్చివేతలు చేపట్టకూడదని 2024లో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా కూల్చివేతలు చేపట్టడమే కాకుండా, ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రా తప్పుడు ప్రచారం చేసుకుంటుందని బాధిత వ్యక్తి న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.