తెలంగాణ
HYDRAA JOBS: ‘హైడ్రా’ డ్రైవర్ జాబ్స్‌కు పోటెత్తిన నిరుద్యోగులు.. స్టేడియం వద్ద తోపులాట!
ఒక ఉద్యోగం పడితే చాలు.. వేలకు వేలు గుమిగూడే పరిస్థితి.. రూపాయి సంపాదన లేక, ఇంట్లో అడిగి రూపాయి తీసుకోలేక, రోజులు గడిచే కొద్దీ పెరిగిపోతున్న వయసును చూసి నలిగిపోతున్న నిరుద్యోగుల ఆవేదనకు సరూర్‌నగర్ స్టేడియం దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం. కేవలం 150 'హైడ్రా' ఉద్యోగాల కోసం వేలాది మంది యువకులు అర్ధరాత్రి నుంచే స్టేడియం ముందు క్యూ కట్టారంటే.. మన దగ్గర నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, ఒక చిన్న ఉద్యోగం కోసం కుర్రాళ్లు ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో విపత్తు నిర్వహణ, సహాయక చర్యల కోసం ఏర్పాటైన ‘హైడ్రా’ (HYDRAA) సంస్థ చేపట్టిన డ్రైవర్ ఉద్యోగ నియామక ప్రక్రియ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఎల్బీ నగర్ సమీపంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో శనివారం వేకువజాము నుంచే ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
