తెలంగాణ
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. సమ్మె విరమించిన ఆటో డ్రైవర్లు!..
మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడంతో ఆటో సంఘాల డిమాండ్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆటో కార్మికుల కోసం వెల్ ఫెర్ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 2015 తర్వాత ఆటోచార్జీలు పెంచలేదని గుర్తు చేసిన ఆయన.. పెరిగిన ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుని కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఆటోకార్మికుల ప్రతినిధులు,రవాణా అధికారుల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. మరోవైపు పాత ఆటోల్ని స్ప్రాప్ చేసి ఈవీ ఆటోల కొనుగోలులో ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. దీంతో సమ్మెను విరమించేందుకు ఆటో సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం. సమ్మె విరమణతో నగర ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. రోజువారీ రాకపోకలపై ఆందోళనలో ఉన్న ప్రజలకు ఇది ఊపిరిపీల్చుకునే వార్తగా మారింది. మొత్తంగా.. ఆటో సమ్మెకు బ్రేక్ పడే సూచనలు కనిపించడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
