తెలంగాణ

Egg Donation Mafia: హైదరాబాద్‌లో అండాల మాఫియా.. చీకటి దందా వెనక వణికించే నిజాలు!

Egg Donation Mafia: వెండితెరపై చూసే మెడికల్ మాఫియా కథలను తలదన్నేలా హైదరాబాద్ నడిబొడ్డున ఒక భయానక చీకటి రాజ్యం నడిచింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక మహిళల శరీరాలను ఏటీఎం మిషన్లుగా మార్చేసిన ఒక కిరాతక ఎగ్ డొనేషన్ నెట్‌వర్క్‌ను సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. వైద్య నిబంధనలను చెత్తబుట్టలో వేసి, ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఒక్కో మహిళ నుంచి పదే పదే అండాలు తీసి కోట్లు కొల్లగొట్టిన ఈ ముఠా అకృత్యాలు బయటకు రావడంతో యావత్ సమాజం ఉలిక్కిపడింది.సాధారణంగా ఐవీఎఫ్ రూల్స్ ప్రకారం ఒక మహిళ జీవితకాలంలో పరిమితంగా మాత్రమే అండాల సేకరణ జరగాలి. అది కూడా పూర్తి ఆరోగ్య పరీక్షలు, చట్టబద్ధమైన గైడ్‌లైన్స్ ప్రకారమే సాగాలి. కానీ ఈ ముఠా దృష్టిలో మహిళలు కేవలం లాభాలు తెచ్చిపెట్టే సరుకులు మాత్రమే. ప్రమాదకర హార్మోన్ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా గుచ్చి, శరీరం తట్టుకోలేక విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా ఒక్కో మహిళ నుంచి ఏకంగా 10 సార్లు అండాలు బయటకు లాగేశారు.