తెలంగాణ
జేఎన్టీయూహెచ్లో కలకలం..కీలక ఫైళ్లు మాయం!..
జేఎన్టీయూహెచ్లో కీలక ఫైళ్ల మాయం కలకలం రేపుతోంది. ఆర్థిక విభాగం అధికారి సురేందర్ దాదాపు 20 రోజులుగా విధులకు హాజరుకాలేదు. మొబైల్ స్విచ్ఆఫ్లో ఉండగా.. రెండు రోజుల క్రితం కార్యాలయానికి వచ్చి కొన్ని ముఖ్యమైన ఫైళ్లను తీసుకెళ్లినట్లు భద్రతా సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆర్థిక విభాగం కార్యాలయాన్ని అధికారులు సీల్ చేశారు. మరోవైపు.. 2023–24లో పరీక్షల విభాగం చేసిన రూ.37.62 కోట్ల ఖర్చుల్లో సుమారు రూ.30 కోట్లకు మాత్రమే రసీదులు ఉండటంపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 11 మంది సిబ్బందికి రూ.10.11 లక్షలు అదనంగా చెల్లించినట్లు కూడా గుర్తించారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణతో పాటు పోలీసు కేసు నమోదైంది. అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ స్పష్టం చేశారు.
