క్రైమ్
రాయచూర్‌లో దారుణం.. సిగరెట్ ఇవ్వలేదని వ్యాపారి హత్య!
కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయచూర్‌లో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అప్పుగా సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడనే చిన్న కారణంతో, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడిన ఒక యువకుడు కిరాణా వ్యాపారిని కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. రాయచూర్ పట్టణ పరిధిలోని ఎల్బీఎస్ నగర్, క్రౌన్ బేకరీ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. నర్సింహులుపై కొడవలితో దాదాపు ఎనిమిది సార్లు దారుణంగా వేటు వేశాడు. ఈ తీవ్రమైన దాడిలో తీవ్ర గాయాలపాలైన నర్సింహులు రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోర హత్యకు సంబంధించిన భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.
