పల్నాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
ఏపీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న రాత్రి పల్నాడుతో మరో ఘోరం చోటుచేసుకుంది. చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.మృతులను బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మగా గుర్తించారు.మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకల కోసం బాధితులు ఆటోలో వెళ్లినట్టు సమాచారం. వేడుకలు ముగించుకుని వేలూరు గ్రామానికి తిరిగి వస్తుండగా విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
