National

Home Appliances: పండుగ ఆఫర్ల ఆశలపై పిడుగు.. భారీగా పెరిగిన ధరలు!

Home Appliances: దసరా, దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లలోకి కొత్త కాంతులు తెచ్చుకోవాలని, పాత టీవీ స్థానంలో స్మార్ట్ టీవీ, వంటింట్లోకి కొత్త రిఫ్రిజిరేటర్ లేదా వాషింగ్ మెషీన్ కొనుక్కోవాలని మధ్యతరగతి కుటుంబాలు ఏడాదంతా ఎదురుచూస్తుంటాయి. పండుగ వేళ కంపెనీలు ప్రకటించే భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్చేంజ్ బోనస్‌లు తమ బడ్జెట్‌కు సరిపోతాయని కలలు కంటారు. కానీ ఈసారి మాత్రం ఆ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆఫర్ల పలకరింపులకు బదులు, పండుగ రాకముందే నిత్యావసర ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు వచ్చాయి. పండుగ ఆఫర్ల ఆశలపై కంపెనీలు ఒక్కసారిగా ధరల పిడుగు విసిరాయి.సాధారణంగా పండుగల సమయంలో మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరల్లో కొద్దిగా మార్పులుంటాయి. కానీ ఈ ఏడాది గృహోపకరణాల ధరలు పెరగడం ఇది ముచ్చటగా మూడోసారి. గతంతో పోలిస్తే ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ రేట్లు ఏకంగా 30 శాతం వరకు ప్రియమయ్యాయి. గతంలో రూ.10,000 పలికిన బేసిక్ మోడల్స్ ఇప్పుడు ఏకంగా రూ.13,000 కడితే తప్ప దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ఉపకరణాలపై 23 శాతం వరకు ధరలు పెరగ్గా, తాజాగా మరో 5 నుంచి 8 శాతం అదనపు భారం పడింది. పండుగ బోనస్‌లు చేతికొచ్చే లోపే మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకడం మధ్యతరగతి ప్రజలను తీవ్ర అయోమయంలో పడేసింది.