తెలంగాణ

తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. వారికి జరిమానాలు

HMWSSB: హైదరాబాద్ నగరవాసులకు జలమండలి తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ఓవైపు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క శివార్లలో జనం అల్లాడుతుంటే, మరోవైపు తాగునీటితో కార్లు కడగడం, రోడ్లు, ఫ్లోర్లు క్లీన్ చేస్తూ నీటిని విచ్చలవిడిగా వృథా చేసేవారి ఆటలు ఇకపై సాగబోవని తేల్చి చెప్పింది. విలువైన తాగునీటిని వృథా చేస్తే భారీ ఎత్తున జరిమానాలు విధించడమే కాకుండా, రెండోసారి మిస్ యూజ్ చేస్తూ దొరికితే ఏకంగా తాగునీటి కనెక్షన్‌నే శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరిస్తూ సరికొత్త రూల్స్‌ను ప్రకటించింది.కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జలమండలి ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం నీటి సరఫరా వేళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో తాగునీటిని వృథా చేస్తున్న ఐదుగురిని పట్టుకుని అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించారు. ఇటీవల ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని ఇష్టారాజ్యంగా వాడుతున్న ఓ మహిళకు ఏకంగా రూ.20,000 ఫైన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు.