తెలంగాణ

మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణలో సర్కారుకు హైకోర్టు షాక్!

తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో తమ భూములు ఇవ్వబోమని బాధితులు ముందు నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలిసింది. ఇదిలాఉండగా, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌లోని భూములను సేకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే, తమ భూములు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. డీపీఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, కె.ప్రతీక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ల భూములని స్వాధీన పరుచుకోవొద్దని ప్రభుత్వాన్నిఆదేశించింది.