తెలంగాణ

రాష్ట్రానికి భారీ వర్షసూచన.. రెండ్రోజులు బీ అలర్ట్

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. వినాయకచవితి రోజున రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. అయితే, నేడు, రేపు రాష్ట్రంలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు, తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు అత్యంత ఉక్కపోత ఉంటుందని, వాతావరణంలో మాత్రం తేమ ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం తర్వాత అక్కడక్కడ చెదురుమొదురు జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.రాత్రి వేళ నుంచి తెల్లవారుజాము సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని, పలు జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన భీకర వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.