రైతు మెడకు ఉరి.. జీవో నెంబర్ 17- హరీశ్ రావు సంచలనం
GO 17: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విరుచుకుపడ్డారు. పాత రోజులు తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తన మాట నిలబెట్టుకున్నారని విమర్శించారు. ఏపీలో కృష్ణా నీళ్లు పుష్కలంగా పారుతున్నాయన్న హరీశ్ రావు.. రేవంత్ వదిలిన నీటిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిసి పెట్టారని చెప్పారు.
ప్రభుత్వం చేతకానితనం వల్ల, కరెంటు ఇవ్వకపోవడం వల్ల, కృష్ణా నదిలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఇవాళ పాలమూరుకు రేవంత్ రెడ్డి పేరిట గ్రహణం పట్టిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు బాధలు తెచ్చింది అంటూ నిప్పులు చెరిగారు. ఇక రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నెంబర్ 17పై తీవ్రంగా స్పందించారు హరీశ్ రావు. జీవో నెంబర్ 17తో రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసిందని ధ్వజమెత్తారు.
