కృష్ణా జలాలు కుప్పంకు.. పాలమూరును ఎండబెడతారా : హరీశ్ రావు
Harish Rao: కృష్ణా జలాల తరలింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ రైతాంగం కష్టాలపై కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. శ్రీశైలం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వరకు కృష్ణా జలాలు నిరాటంకంగా తరలిపోతుంటే, కళ్లముందే ఉన్న పాలమూరు నేలలకు మాత్రం చుక్క నీరు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇది పాలకుల చేతగానితనానికి నిదర్శనమని, స్వయంగా ‘పాలమూరు బిడ్డ’ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక రైతులకు చేస్తున్న తీరని నమ్మకద్రోహమని విమర్శించారు.జూరాల ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడాలని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన బాట పట్టిన అన్నదాతలను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీళ్లు అడిగిన రైతన్నల చేతులకు సంకెళ్లు వేయడం, ప్రాజెక్టుల వద్ద ఖాకీ బలగాలను మోహరించి భయానక వాతావరణం సృష్టించడం సిగ్గుచేటని అన్నారు.
