తెలంగాణ

'రేవంత్ ప్రభుత్వంలో ప్రజల భూములకు రక్షణ కరువు'

తెలంగాణలో 22-ఏ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి అనేది ప్రజల హక్కు అనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. వ్యాపారంలో ఉన్నప్పుడు భూమి ఒక ఆస్తి కావచ్చని.. కానీ ప్రభుత్వంలో భూమి అనేది ప్రజల హక్కు అనే సోయి మరిచి జనాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లక్షలాది మంది జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు.22-ఏ కారణంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఓ ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఊరంతా కలిసి ఆ వివాహాన్ని జరిపించిందని చెప్పారు. అయితే ఇంకా ఎన్ని పెళ్లిళ్లు ఇలా ఆగిపోయాయి? ఎన్ని గుండెలు పగిలిపోయాయి? ఎన్ని చదువులు నిలిచిపోయాయో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.