తెలంగాణ

Harish : 22ఏతో లక్షల మంది భూములు కొట్టేయడానికి రేవంత్ కుట్రలు : హరీశ్‌రావు

తెలంగాణలో 22-ఏ భూముల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. 22-ఏ అనేది లక్షల మంది ప్రజల ఆవేదనగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య ఉందని, ఎవరి నోట విన్నా 22-ఏపై ఆవేదనే వినిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సమస్య మొదలైందని బాధితులు చెబుతున్నారని ఆయన అన్నారు. 1908లో బ్రిటిష్ కాలంలో 22-ఏ నిబంధనను తీసుకొచ్చారని హరీశ్‌రావు వివరించారు. నిర్దిష్టమైన భూములను నిషేధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం దీని ఉద్దేశమన్నారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను కాపాడేందుకు 22-ఏ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 22-ఏ 1(ఏ) కింద ప్రభుత్వ, పోరంబోకు భూములు, 22-ఏ 1(బీ) కింద ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, 22-ఏ 1(సీ) కింద దేవాదాయ, వక్ఫ్ భూములు, 22-ఏ 1(డీ) కింద ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూములు వస్తాయని చెప్పారు.