తెలంగాణ

GRMB : గోదావరి జలాల వివాదంపై హై టెన్షన్.. జీఆర్ఎంబీ సమావేశం వాయిదా

తెలుగు రాష్ట్రాల నడుమ మరోసారి జలవివాదం ముదిరిన విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంలో తమకు అన్యాయం జరుగుతోందని ఓ వైపు తెలంగాణ ఆరోపిస్తుంటే..లేదు లేదు తమకే అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఎగువన తెలంగాణ ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడుతూ తమకు న్యాయంగా రావాల్సిన వాటాను వాడుకోకుండా చేస్తున్నదని ఏపీ వాదిస్తుంటే.. కృష్ణా జలాల్లో దక్షిణ తెలంగాణకు నష్టం వాటిల్లే విధంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య ఎల్లుండి జరగాల్సిన గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) సమావేశం వాయిదా పడినట్టు తెలిసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున జీఆర్ఎంబీ బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు గోదావరి రివర్ బోర్డు తెలిపింది. మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ రేపు యథాతథంగా జరగనుంది.