తెలంగాణ

నాగార్జునసాగర్‌లో వైభవంగా వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి!

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ తీరంలో అత్యంత వైభవంగా వరుణయాగాన్ని చేపట్టింది. సాగర్ ప్రాజెక్టు పరిధిలోని విజయ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే ఆది పూజలతో ఈ మహా క్రతువు ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమ గుండాలతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.