తెలంగాణ

ఆశావహులకు శుభవార్త.. నెలరోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.ఇంతకాలం పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభవార్త చెప్పారు. దీంతో వారంతా మరోసారి జోరుగా లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హైకమాండ్ పెద్దలతో పరిచయం ఉన్న నేతలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఏఐసీసీ పెద్దలతో సమావేశానికి ముందు మీడియాతో మాడ్లాడారు.రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారం కాంగ్రెస్ పాపం కాదని పేర్కొన్నారు. తన పదవీకాలానికి మరో ఏడాది సమయం ఉందని పేర్కొన్న మహేశ్ గౌడ్.. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిదే అని తెలిపారు. నామినేటెడ్ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా త్వరలో చేపడతామని చెప్పారు.