Gold Demand: బంగారంపై మోజు తగ్గిందా.. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన పసిడి డిమాండ్!
old Demand: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న బంధం కేవలం ఒక లోహంతో ముడిపడినది కాదు.. అది సంప్రదాయం, సెంటిమెంట్, ఆపత్కాలపు ఆస్తి. పెళ్లిళ్లు, పండుగలు, చిన్న చిన్న శుభకార్యాలొచ్చినా మెడలో నాలుగు గ్రాముల పసిడి మెరిసిపోవాల్సిందేనని ఆశపడే అతివలు మన దేశంలో కోట్లలో ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ బంగారు దుకాణాల వైపు చూడాలంటేనే జనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా కనిపించే నగల షాపుల్లో సందడి తగ్గడం చూస్తుంటే.. అసలు భారతీయుల్లో బంగారంపై ఉన్న మోజు తగ్గిపోయిందా? లేక భగ్గుమంటున్న ధరలు సామాన్యుడిని ఆమడదూరంలో నిలబెట్టాయా? అనే సందేహాలు మొదలయ్యాయి.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో పసిడి డిమాండ్ ఊహించని రీతిలో పడిపోయి ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి గిరాకీ ఏకంగా 29 శాతం క్షీణించింది.
