రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్
రెండేళ్లు సమయం ఇచ్చి సహకరిస్తే.. పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి టీచర్లంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.శనివారం కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్‌కు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు టైం ఇవ్వండి. ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా.రెండేళ్లలో సమస్యలన్నింటినీ మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టంచేశారు.
