TG : గిగ్ వర్కర్ల ర్యాలీ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నిత్యం ఉరుకుల పరుగుల జీవనం గడిపే వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీచేశారు.శనివారం గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీ దృష్ట్యా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి గిగ్ వర్కర్స్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. లోక్సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు ఈ పాలసీని అంకితం చేయనున్నారు.ఉదయం 10:30 గంటలకు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి నిర్వహించే బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనన్నారు. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రధాన రహదారి ఏరియాల్లో ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ ఏర్పాటు చేశారు.ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సైబర్ టవర్స్ నుంచి హెచ్ఐసీసీ (HICC), నోవాటెల్ మధ్య రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
