Fuel Price Hike: చమురు సంస్థలకు భారీ నష్టాలు.. మళ్లీ రేట్లు బాదుడేనా?
Fuel Price Hike: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నిప్పులు చెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం భారత చమురు మార్కెట్‌ను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేస్తోంది. విదేశాల్లో ముడి చమురు విలువ కొండెక్కుతున్నా, దేశంలో జనాలపై భారం మోపకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) పెట్రోల్, డీజిల్ రేట్లను మార్చకుండా హోల్డ్‌లో పెట్టాయి. దీంతో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ దాదాపు రూ. 530 కోట్ల మేర గట్టిగా నష్టపోతున్నాయని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' వెల్లడించింది.ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. ఇక్రా తాజా నివేదిక ప్రకారం నష్టాల లెక్కలు ఇలా ఉన్నాయి. లీటరు పెట్రోల్ అమ్మకంపై కంపెనీలకు సుమారు రూ. 8 వరకు నష్టం వస్తోంది. లీటరు డీజిల్ అమ్మకంపై ఏకంగా రూ. 9 దాకా కోత పడుతోంది. ఇళ్లలో వాడే ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై సంస్థలకు దాదాపు రూ. 300 వరకు భారం పడుతోంది.
