తెలంగాణ

భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్ టికెట్.. సిగ్గనిపిస్తలేదా? : హరీశ్ రావు

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. పండుగల వేళ టీజీఎస్ఆర్టీసీ ‘స్పెషల్’ బస్సుల పేరిట చార్జీలను రెండింతలు చేసి వసూలు చేస్తుండటంపై ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు ఇష్టానుసారం ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల్ని బాదుడేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా పండుగవేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ చార్జీలు డబుల్ చేసి జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు పెట్టి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని చెప్పారు. భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్.. ఇలా చేస్తే మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన? అని ప్రశ్నించారు.