ముస్లింలకు ఫ్రీ కరెంట్.. హిందువులకు హైడ్రానా? : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం (ఎక్స్)వేదికగా కౌంటర్ ఇచ్చారు. నిన్న కూకట్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓల్డ్ సిటీలో మైనారిటీలు కరెంట్ బిల్లులు కట్టరనే ఆరోపణలు ఉన్నాయని, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరాక అమలు చేస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత పథకం వల్ల ఎక్కువగా మైనారిటీలకే లబ్ధి చెందుతోందని సీఎం అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఫైర్ అయ్యారు.'పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని తెలంగాణ సీఎం అన్నారు. ఇదే మీ ప్రభుత్వ విధానమైతే.. నిబంధనలు పాటించలేదనే కారణంతో హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పుడు పేద కుటుంబాల విషయంలో ఇదే సానుభూతిని ఎందుకు చూపడం లేదు?' అని ప్రశ్నించారు.
