కృష్ణా బేసిన్లో తగ్గిన వరద ఉధృతి.. మూతపడిన జూరాల గేట్లు!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి గణనీయంగా తగ్గింది. కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. కృష్ణా బేసిన్లో ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఇన్ ఫ్లో ఒక్కసారిగా పడిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కొన్ని రోజుల క్రితం వరకు సుమారు రెండున్నర లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో ప్రస్తుతం 36,233 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు అవుట్‌ఫ్లో 38,369 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 178.74 టీఎంసీల నీరు ఉంది. జలాశయంలో ఉన్న నీటితో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
