తెలంగాణ

నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న అన్నదాత.. వీడియో వైరల్!

రాష్ట్రంలో వర్షాలు లేక మరో వైపు సాగుకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే, ఎల్ నిన్ ఎఫెక్ట్ కారణంగా వర్షాకాలం అయినా వానలు పడటంలేదు. రైతులు ఏమో వరి వేసేందుకు సిద్ధం అవుతుండగా..ప్రభుత్వం మాత్రం పంట మార్పిడి చేయాలని, వర్షాలు లేనందున ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని చెబుతోంది. రైతులకు నీళ్లివ్వాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరుతోంది. ఇదిలాఉండగా, ఖమ్మం జిల్లాలో సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు సోమవారం ఉదయం రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడిన ఓ రైతు.. నీటిని విడుదల చేయించాలని వేడుకున్నాడు.