రాజకీయాలు

హైదరాబాద్‌లో ఫేక్ డిఫెన్స్ కంపెనీలు.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు

తెలంగాణలో ఫేక్ డిఫెన్స్ కంపెనీలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ పాలనలో ఫేక్ ఏరోస్పేస్,డిఫెన్స్ షెల్ కంపెనీలకు అడ్డగా హైదరాబాద్ మారుతోందన్నారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ట్యాగ్ చేస్తూ నగరంలోని నకిలీ కంపెనీలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పలువురు కీలక నేతల కుటుంబాలకు చెందిన అనుమానాస్పద కంపెనీలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న టెసరాక్ట్ ఏరోస్పేస్ షెల్ కంపెనీ వ్యవహారం బయటపడిందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ ఏరోస్పేస్ కంపెనీ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. తాజాగా ఐంద్రి డిఫెన్స్ అనే మరో షెల్ కంపెనీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.