తెలంగాణ

కోరుట్లలో కలకలం.. వ్యవసాయ బావిలో మందులు, వైద్య వ్యర్థాలు

Korutla: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేగింది. అయ్యప్ప గుట్ట శివారులోని వ్యవసాయ బావిలో ప్రభుత్వ మందులు, వైద్య వ్యర్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు మెడిసిన్స్ తీసుకొచ్చి అక్కడ పారబోస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించాల్సిన లక్షలాది రూపాయల విలువైన మెడిసిన్స్ ను ఇలా పారబోసి తగలబెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆ మెడిసిన్స్ పై ప్రభుత్వ ముద్రలు ఉన్నాయి. అందులో గడువు తీరిన మందులు కూడా ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి వ్యవసాయ బావిలో వాటిని పారవేసినట్లుగా తెలుస్తోంది. మందులతో పాటు సూదులు, గ్లౌజులు వంటి బయో వ్యర్ధాలు కూడా ఉండటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మందులను అక్కడ పారబోసి తగులబెట్టడంతో విషపూరిత పొగ వెలువడుతోందని, చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున వాయు కాలుష్యం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.