ఈవీఎంలు ఫుల్లీ సేఫ్..అవి ఇంటర్నెట్తో కనెక్ట్ కావు : సీఈసీ
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు పదే పదే వస్తుండటంతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఉపయోగించే ఈవీఎంలు ప్రభుత్వ రంగానికి చెందిన పరిశ్రమల్లో తయారవుతాయని.. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి వైర్లెస్ టెక్నాలజీలతో అవి కనెక్ట్ కాలేవన్నారు.యూపీలోని లక్నో పర్యటనలో భాగంగా చారిత్రాత్మక ‘కొల్విన్ తాలూక్దార్స్ కాలేజ్’లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ,ఎన్నికల ప్రక్రియ,ఈవీఎంల నమ్మకం, యువ ఓటర్ల ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని స్పష్టంచేశారు. దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర బాధ్యత అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
