తెలంగాణ

ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం.. పాడికౌశిక్ రెడ్డిపై వేటు!

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్‌షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని జోరుగా ప్రచారం నడుస్తున్న వేళ ఎథిక్స్ కమిటీ ఆయనకు షాక్ ఇచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సభలో ప్రవర్తించిన తీరు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు, అసభ్యకర సైగలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కమిటీ.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. సభా నిబంధనలను, శాసనసభ మర్యాదలను ఉల్లంఘించారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రవర్తన సభ గౌరవాన్ని కించపరిచేలా ఉందని నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీంతో అసెంబ్లీ నిబంధనావళి ప్రకారం ఆయనపై వేటు పడేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.