Etela Rajender: సీఎం కుర్చీపై ఈటల కన్ను పడిందా?.. ఆ ఇంటర్వ్యూ క్లిప్‌తో నెట్టింట దుమారం!
Etela Rajender: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఎప్పటికప్పుడు రాజుకునే ‘సామాజిక న్యాయం’ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యున్నత అధికార పీఠం ఎందుకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది? ఉద్యమాల గడ్డపై సామాజిక సమీకరణాల చర్చ ఎటు మళ్లుతోందని అంటూ ఒక ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ తాజా కామెంట్స్ ఇప్పుడు అధికార, విపక్ష శిబిరాల్లో సరికొత్త ప్రకంపనలు రేపుతున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పాలన మొదలుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు దాదాపు ఏడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందరో ఉద్దండులు ముఖ్యమంత్రులుగా మారినా, సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ వర్గాలకు పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం దక్కలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి దశాబ్దం గడిచినా తెలంగాణ గడ్డపై అదే ఆధిపత్య రాజకీయ సమీకరణాలు పునరావృతమవుతున్నాయన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సున్నితమైన అంశాన్ని నేరుగా ఎత్తిచూపడం ద్వారా ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన చర్చకు తెరలేపారు.
