తెలంగాణ

Erravalli Lands Inquiry: రెవెన్యూ టీమ్స్ ఎంట్రీ.. ఎర్రవల్లి చుట్టూ హీటెక్కిన రాజకీయం

Erravalli Lands Inquiry: మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల పరిధిలోని భూ రికార్డులపై రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి విచారణను ముమ్మరం చేసింది. ఫాంహౌస్‌ను ఆనుకుని ఉన్న ఏకంగా 385 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయా అన్న కోణంలో అధికారులు జల్లెడ పడుతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సిద్దిపేట కలెక్టరేట్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కూక్ తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి.వెంకటాపూర్, వరదరాజపూర్, ఎర్రవల్లి సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325తో పాటు పరిసర నంబర్లలోని అసైన్డ్ భూములను అధికారులు స్వయంగా పరిశీలించారు. అసలు రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి ఎంత ఉండాలి? ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణం ఎంత? అనే వివరాలను సరిపోల్చుతున్నారు.