ఎర్రవల్లి భూముల సర్వేలో గందరగోళం.. వెంకటాపూర్ రైతుల ధర్నా!
Erravalli: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు అత్యంత సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 325 పరిధిలోని భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా, పాలనాపరంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వే నెంబర్లోని మొత్తం 388 ఎకరాల భూమి సరిహద్దులను తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగగా, సరిగ్గా సర్వే మొదలయ్యే సమయానికి ఊహించని రీతిలో పక్క గ్రామం రైతులు తెరపైకి వచ్చి పంచాయితీ పెట్టడం సంచలనంగా మారింది.ఎర్రవల్లి పరిధిలోని ఈ వివాదాస్పద సర్వే నెంబర్లో అధికారులు రీ-సర్వే చేపట్టడంపై శివారు వెంకటాపూర్ గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మొత్తం 388 ఎకరాల భూమి కేవలం ఎర్రవల్లి వాసులదే కాదని, అందులో ఎర్రవల్లి రైతులకు 250 ఎకరాలు మాత్రమే చెందుతుందని వారు కుండబద్దలు కొట్టారు. మిగిలిన భూమిపై వెంకటాపూర్ గ్రామ రైతులకు పూర్తి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పారు. దశాబ్దాల క్రితం రెవెన్యూ అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పిదాల వల్లే రికార్డులు తారుమారయ్యాయని, తప్పుడు ఎంట్రీలతో తమ హక్కులను కాలరాశారని మండిపడుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేను పాత కాస్రా, సిత్వార్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
