International

Elon Musk : మస్క్ అన్నయ్య.. నీతులు చెప్పడమే కానీ పాటించడం తెలీదా?

Elon Musk: "నేను ఏ రాజకీయ పార్టీకి గుడ్డిగా కొమ్ముకాయను.. ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రవాహం ప్రమాదకరం.. ఇకపై రాజకీయాల కోసం పైసా కూడా విదిలించను!" ఇలా మైకులు దొరికినప్పుడల్లా, అలాగే తన సొంత 'ఎక్స్' ఖాతాలోనూ సుద్దులు చెప్పడంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి మించిన వారు మరొకరు ఉండరు. భారతదేశంలో రిలయన్స్ వంటి సంస్థలు ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని గతంలో ప్రవచనాలు వండివార్చిన ఈ టెక్ టైకూన్.. ఇప్పుడు తన సొంత దేశమైన అమెరికాలో చేస్తున్నదేంటి? కేవలం రాజకీయ అధికారాన్ని శాసించడానికి, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏకంగా రూ.3,000 కోట్లకు పైగా నిధులను ఎన్నికల బరిలోకి కుమ్మరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పడం వేరు.. సొంత లాభం చూసుకోవడం వేరు అని మస్క్ చేతలే నిరూపిస్తున్నాయి.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం సుమారు 290 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టిన తర్వాత.. ఇకపై రాజకీయ ఫండింగ్‌లకు దూరంగా ఉంటానని 2025లో మస్క్ స్వయంగా ప్రగల్భాలు పలికారు. కానీ ఆ మాటలన్నీ కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితమని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తాజా పరిశోధనాత్మక నివేదికతో బట్టబయలైంది. రాబోయే మిడ్-టర్మ్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, రిపబ్లికన్ పార్టీకి పట్టున్న కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకు మస్క్ ఇప్పటివరకు ఏకంగా $366 మిలియన్లు (రూ.3,000 కోట్లకు పైగా) వెచ్చించారు.